భార్యకిచ్చిన మాట కోసం 14 ఏళ్ళు ఎన్టీఆర్‌తో కలిసి నటించని ఎఎన్నార్!
on Mar 29, 2024
తెలుగు సినీ పరిశ్రమకు ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు రెండు కళ్ళు లాంటివారు అంటుంటారు. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరు తారలు ఎనలేని సేవ చేశారు. ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి, అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి దోహదపడ్డారు. అప్పట్లో ఇద్దరూ టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా అన్నదమ్ముల్లా మసలేవారు. ఇద్దరూ హీరోలుగా మంచి పొజిషన్‌లో ఉన్నప్పటికీ కలిసి నటించేందుకు సంశయించేవారు కాదు. అలా వారిద్దరూ కలిసి 14 సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా వారి సినిమా బంధానికి బ్రేక్ పడిరది. దానికి కారణం అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ. ఎన్.టి.రామారావుతో కలిసి నటించవద్దని అక్కినేని దగ్గర మాట తీసుకుంది. ఆమెకిచ్చిన మాట కోసం 14 సంవత్సరాలపాటు ఒక్క సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించలేదు. అన్నదమ్ముల్లాంటి వారి మధ్య అలాంటి అగాధం ఏర్పడడానికి కారణం ఏమిటి? ఎన్టీఆర్‌తో కలిసి నటించకూడదని ఎఎన్నార్ ఎందుకు నిర్ణయించుకున్నారో తెలుసుకోవాలంటే ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.
1941లో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రంలో ఒక చిన్న క్యారెక్టర్ చెయ్యడం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు అక్కినేని నాగేశ్వరరావు. 1944లో ‘సీతారామ జననం’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 5 సంవత్సరాలకు ‘మనదేశం’ చిత్రం ద్వారా ఎన్.టి.రామారావు చిత్ర రంగ ప్రవేశం చేశారు. వీరిద్దరూ తొలిసారి 1950లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ఇద్దరూ కథానాయకులుగా నటించి మెప్పించారు. 1963లో వచ్చిన ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రంతో వీరి కాంబినేషన్‌కి బ్రేక్ పడిరది. ఇద్దరూ టాప్ హీరోలుగా వెలుగొందుతున్నప్పటికీ కలిసి నటించేందుకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవారు కాదు. అలాంటిది ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రం వారిని విడదీసింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా, ఎఎన్నార్ అర్జునుడుగా నటించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభం కావడానికి నాలుగేళ్ళ ముందే దర్శకుడు కె.బి.తిలక్ ‘కృష్ణార్జున’ అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా, జగ్గయ్య అర్జునుడుగా అనుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి నటించిన ‘గుండమ్మకథ’ విడుదలైంది. ఈ సినిమా చూసిన తర్వాత కె.బి.తిలక్‌కి ఒక ఆలోచన వచ్చింది. అర్జునుడుగా అక్కినేని అయితే బాగుంటుంది అనిపించింది. ఈ విషయాన్ని జగ్గయ్యకు చెప్పి అతన్ని బలరాముడి క్యారెక్టర్ చెయ్యమన్నారు. జగ్గయ్య ఓకే చెప్పారు. ఆ తర్వాత అర్జునుడుగా నటించమని అక్కినేనిని అడిగారు. పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ పక్కన చెయ్యడానికి ఇష్టపడని అక్కినేని దానికి ఒప్పుకోలేదు. ఆర్టిస్టుల ఎంపికతోపాటు మరికొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో ఈ సినిమా నిర్మాణాన్ని మొత్తానికే ఆపేశారు.
1963లో అక్కినేని నాగేశ్వరరావుకి మరోసారి అర్జునుడుగా నటించాల్సిన అవసరం వచ్చింది. కె.వి.రెడ్డి స్వీయ దర్శకత్వంలో ‘శ్రీకృష్ణార్జునయుద్ధం’ చిత్రం నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడుగా, ఎఎన్నార్ అర్జునుడుగా నటించారు. ఈ క్యారెక్టర్ చెయ్యడానికి మొదట ఎఎన్నార్ అయిష్టంగా ఉన్నప్పటికీ తమ సొంత సినిమా అయిన ‘దొంగరాముడు’ చిత్రానికి కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారన్న గౌరవంతో ఆయన కోసం అర్జునుడుగా నటించేందుకు ఒప్పుకున్నారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారధ్యంలో రూపొందిన పాటలు అందర్నీ అలరించాయి. ఒక అప్పుడే ఒక సమస్య తలెత్తింది. మహాభారత కథ కావడంతో అందులో శ్రీకృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కినేని పాత్ర తేలిపోయింది. ఇది అక్కినేని అభిమానుల్ని ఎంతో బాధించింది. ఇదే విషయాన్ని అక్కినేని సతీమణి అన్నపూర్ణకు చేరవేశారు అభిమానులు. సినిమా చూసిన తర్వాత ఆమెకు కూడా అదే భావన కలిగింది. ఆమె వెంటనే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అక్కినేనికి చెప్పింది. ఇకపై ఎన్టీఆర్‌తో కలిసి ఎఎన్నార్ నటించకూడదు అనేదే ఆ నిర్ణయం. ఈ విషయంలో అక్కినేని నుంచి హామీ కూడా తీసుకున్నారు అన్నపూర్ణ. అప్పటి నుంచి 14 సంవత్సరాలు ఎన్టీఆర్, అక్కినేని కలిసి ఒక్క సినిమా కూడా చెయ్యలేదు. 1977లో వచ్చిన ‘చాణక్య చంద్రగుప్త’ సినిమాలో ఎన్టీఆర్, ఎఎన్నార్ మళ్లీ కలిసి నటించారు. ఈ సినిమాలో నటించాల్సిందిగా కోరేందుకు ఎన్టీఆర్ స్వయంగా ఎఎన్నార్ ఇంటికి వెళ్ళారు. ఆయనే స్వయంగా వచ్చి అడగడంతో కాదనలేకపోయారు అక్కినేని. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఈ సినిమా తర్వాత 1978లో ‘రామకృష్ణులు’, 1981లో ‘సత్యం శివం’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి నటించారు. ఆ తర్వాత రెండేళ్ళకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడంతో మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు.
Also Read